గ్రేట్ సార్.. హైద‌రాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజన్ల ప్రశంసలు..!

Thursday, November 5th, 2020, 02:40:22 AM IST

ఫ్రెండ్లీ పోలిసింగ్ అని చెప్పడం కాదు నిజంగా మన పోలీస్ శాఖ అది చేసి చూపిస్తుంది. ఏ ఆపదలోనైనా మేమున్నామంటూ, ఎటువంటి పరిస్థితులలోనైనా ధైర్యంగా తమను సంప్రదించవచ్చని ప్రజలకు చెబుతూ ఉంటుంది. కరోనా సమయంలోనే కాకుండా ఇటీవల‌ న‌గ‌రాన్ని భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడు సైతం పోలీసు యంత్రాంగం చేసిన సేవలు, సహాయక చర్యలు వెలకట్టలేనివి. అయితే తాజాగా నగరంలో ఓ రోగిని ఆస్ప‌త్రికి చేర్చేందుకు వెళ్తున్న అంబులెన్స్‌కు ట్రాఫిక్ క్లియ‌ర్ చేయ‌డంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది.

అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి. బాబ్జీ మొజంజాహీ మార్కెట్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో కోఠి వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బాబ్జీ వెంటనే రంగంలోకి దిగి అంబులెన్స్ ముందుకు వెళ్లి రోడ్డుపై ప‌రుగులు పెడుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశాడు. ఇలా దాదాపు కిలోమీటర్ మేరకు పరుగెడుతూ అంబులెన్స్‌కి దారి ఇప్పించాడు. అయితే సకాలంలో అంబులెన్స్ ఆసుపత్రికి చేరడంతో అందులోని వ్య‌క్తి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీపై అటు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.