హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు పిల్లలు కలగడం లేదన్న అక్కసుతో ఓ మహిళ సోదరుడి కొడుకుని బిల్డింగ్ మీద నుంచి కిందకు విసిరేసి చంపేసింది. అయితే అసలు వివరాల్లోకి వెళితే పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈది బజార్ కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన అయేషా, అహ్మద్ ఉద్దీన్లకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లై రెండు సంవత్సరాలు కావస్తున్నా అయేషాకు ఇంకా పిల్లలు పుట్టలేదు.
ఈ నేపథ్యంలో నేడు అయేషా తన సోదరుడి కుమారుడు వరుసకు మేనల్లుడైన మూడేళ్ల నుమాన్ ఉద్దీన్ను తన ఇంటికి తీసుకొచ్చింది. ఆ తరువాత ఆడుకునేందుకు పిల్లాడిని భవనంపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఏ దురుద్దేశ్యం పుట్టిందో ఏమో అభం శుభం తెలియని ఆ బాలుడిని అయేషా బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేసింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి నుమాన్ అక్కడిక్కడే మరణించాడు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలు అయేషాను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.