శంషాబాద్ కు మెట్రో!

Tuesday, May 12th, 2015, 05:49:22 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మెట్రో రైలు పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో రైలు నిర్మాణ పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఫలక్ నామా, రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నడిపే అవసరముందని కెసిఆర్ పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ మెట్రో హైదరాబాద్ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి సైతం ఉపయోగపడేలా ఉండాలని అభిలషించారు. అలాగే మెట్రో రైలుకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు కెసిఆర్ అంగీకరించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్థ హైదరాబాద్ మెట్రోకు కూడా ఉండాలని కెసిఆర్ సూచించారు.