హైదరాబాద్‌లో ఈ నెల 7 నుంచి మెట్రో పరుగులు.. మార్గదర్శకాలు ఇవే..!

Friday, September 4th, 2020, 10:30:27 AM IST

కరోనా కారణంగా ఆగిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పరుగులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో కూడా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే దశల వారిగా ప్రారంభమవుతున్న మెట్రో సేవలు మొదటి దశలో సెప్టెంబర్ 7 నుంచి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య, రెండో దశలో సెప్టెంబర్ 8 నుంచి నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య, మూడో దశలో సెప్టెంబర్ 9 నుంచి అన్ని కారిడార్లలోనూ మెట్రో రైళ్లను నడపనున్నట్టు తెలుస్తుంది.

అయితే ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. మెట్రో రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో కూడా ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని లేదంటే జరిమానా విధిస్తామన్నారు. ఇకపోతే కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతులు ఇస్తామని అన్నారు. ప్రయాణికులు కేవలం స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలోనే ప్రయాణించాలని అంతేకాకుండా మినిమం లగేజీనీ మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. కంటైన్మెంట్ జోన్లు ఉండే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయని, ప్రతి రోజూ రాత్రి సమయంలో అన్ని స్టేషన్లను క్లీన్ చేస్తారని తెలిపారు.