గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..!

Wednesday, November 18th, 2020, 12:01:05 AM IST


గ్రేటర్ ఎన్నికలకు ఓ పక్క నేడు నోటిఫికేషన్ విడుదలైతే, మరోపక్క నగరానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురయ్యింది. వరదల సమయంలో ప్రభుత్వం అందించిన 10 వేల సాయం అందని వారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు బారులు తీరారు. అయితే వరద బాధితుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించడానికి జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తన నియోజకవర్గ పరిధిలోని ఓ మీ సేవ కేంద్రానికి వెళ్ళారు.

అక్కడ వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన బాధితులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మాగంటి ప్రయత్నించారు. అయితే క్యూ లైన్‌లో నిల్చుని ఆగ్రహంతో ఉన్న వరద బాధితులు ఎమ్మెల్యేను చూసిన వెంటనే మరింత ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులు ఏమైపోయారంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేయడంతో చేసేదేమిలేక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుండడంతో పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తుంది.