ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్.. పిటిషన్ డిస్మిస్.!

Saturday, May 15th, 2021, 05:31:38 PM IST


వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నిన్న ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టు అక్రమమంటూ రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ బెయిల్ పిటిషన్‌ను కొట్టిపారేసింది.

అయితే ప్రాధమిక ఆధారాలు, విచారణ లేకుండానే రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారంటూ ఆయన తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసినందునే హైకోర్టుకు వచ్చామన్న వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. అయితే రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీనీ హైకోర్టు ఆదేశించింది.