ఏపీ పోలీసులపై రికార్డ్ స్థాయిలో కేసులు.. అసలేం జరుగుతుంది..!

Saturday, October 3rd, 2020, 11:28:02 AM IST

రక్షకభటులు అంటే ప్రజలకు రక్షణ కల్పించే వారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకునే బాధ్యతలు వారిపై ఉంటాయి. అయితే ఏపీలో మాత్రం నేరస్తులపై నమోదయ్యే కేసులు పోలీసులపై నమోదవుతున్నాయి. జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం దేశంలోనే ఏపీ పోలీసులపై రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

అయితే ఏపీ పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రతిపక్షాలు ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఏపీ పోలీసుల తీరుపై కొన్ని సార్లు హైకోర్టు కూడా మండిపడింది. అయితే గత ఏడాది నుంచి దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068 అయితే అందులో 1,681 కేసులు ఒక్క ఏపీ పోలీసులపైనే నమోదయ్యాయని జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదికను బయటపెట్టింది. అయితే ఈ గణాంకాలు చూస్తేనే ఏపీ పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇప్పటికైనా ఏపీ పోలీసులు రాజకీయ శక్తులకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రజల కోసం పనిచేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి కట్టుబడి ఉండాలని కోరుకుందాం.