ఏం చేయాలనుకుంటున్నారు.. తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ హైకోర్టు..!

Thursday, December 31st, 2020, 03:16:41 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ వేడుకలపై వచ్చిన మీడియా కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు కొత్త రకం కరోనా వైరస్ ప్రమాదకరమని హెల్త్‌ డైరెక్టర్‌ చెబుతున్నా నూతన సంవత్సరం వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.

రాష్ట్రంలో విచ్చలడిగా పబ్‌లు, బార్‌లు ఓపెన్ చేసి ఉంచడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్‌ చేశారని హైకోర్టు వెల్లడించింది. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం న్యూ ఇయర్ వేడుకలను జరపుకోవద్దని ప్రజలకు సూచించినట్టు హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి జనవరి 7న పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.