మీరు మారరా.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

Thursday, November 26th, 2020, 07:30:01 PM IST

కరోనా లెక్కలపై మరియు టెస్టుల విషయంలో ఇప్పటికే పలుమార్లు తెలంగాణ సర్కార్ తీరుపై మండిపడ్డ హైకోర్టు తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పిటీషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50వేల కరోనా టెస్టులు చేయాలన్న ఆదేశాలను పెడచెవిన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేసింది. అవసరమున్నప్పుడే ఆ మొత్తంలో కరోనా పరీక్షలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

అయితే ప్రైవేట్ ఆస్పత్రులలో పరీక్షలు, వైద్య చికిత్సలపై ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేమో కానీ, ఇలానే వ్యవహరిస్తే కరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని తీవ్ర విమర్శలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదన్న స్పష్టమవుతుందని వ్యాఖ్యానించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని, అందుకే రాష్ట్ర ప్రజారోగ్యశాఖకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపింది.