ఆ బిల్లులు ఎలా వచ్చాయి.. ఏపీ సర్కార్‌పై మండిపడ్డ హైకోర్ట్..!

Tuesday, March 30th, 2021, 06:09:06 PM IST

ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. నరేగా పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదని న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఏడాది పాటుగా విచారణ జరుగుతున్న దీనిపై నేడు మరోసారి విచారణ చేపట్టిన హైకోర్ట్ ప్రభుత్వంపై మండిపడింది.

అయితే 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో, ఎంత మొత్తం చెల్లించాలన్న దానిపై కోర్టుకు స్పష్టమైన నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పిన సమాధానం పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే సీఎస్‌ను కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రెండు వారాల్లో దీనిపై పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.