బిగ్‌న్యూస్: తెలంగాణలో మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్..!

Thursday, November 5th, 2020, 05:36:14 PM IST

తెలంగాణలో గతకొద్ది రోజుల నుంచి మిస్సింగ్ కేసులు పెరిగిపోయాయి. అయితే మిస్సింగ్ అయిన వారిలో చాలా మంది ప్రాణాలతో దొరకడంలేదు. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మిస్సింగ్‌ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చింది.

అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారి కేసులే అధికంగా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. దీంతో మిస్సింగ్ కేసులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. షీటీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ చేపట్టామని కూడా తెలిపింది. అయితే మిస్సింగ్ కేసులపై ప్రభుత్వ ప్రణాళిక ఏంటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 3లోగా దీనిపై పూర్తి నివేదిక సమర్పిస్తామని ఏజీ హైకోర్టుకు తెలపగా తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 10కి వాయిదా వేసింది.