తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్.. ఏ చట్టం ప్రకారం సేకరిస్తున్నారు..!

Wednesday, November 4th, 2020, 03:00:30 AM IST


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ధరణి పోర్టల్‌లో వివరాల నమోదు అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఎవరిని ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు ఆస్తుల నమోదు పేరుతో ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కూడా బయటి వ్యక్తులకు ఇవ్వకండని ప్రభుత్వానికి సూచించింది.

అయితే కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని, వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఆ చట్టంలో ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది. వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని, డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే రాలేదని చెప్పుకొచ్చింది. దీంతో డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.