ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు..!

Thursday, October 8th, 2020, 03:50:52 PM IST

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాలపై కొద్ది రోజుల క్రితం వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఏపీ స్పీకర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా లేఖ బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా, తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్‌ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే శాసన సభకు స్పీకర్‌గా వ్యవహరిస్తూ బాధ్యతాయుత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్ళాలి కాని, బహిరంగంగా కోర్టు తీర్పులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరైన విధానం కాదని హెచ్చరించింది. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్ట్ పేర్కొనడంతో, సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలపడంతో ఈ కేసు తీర్పును హైకోర్ట్ రిజర్వ్ చేస్తూ నిర్ణయించింది.