అది మంచిది కాదు.. ఏపీ సర్కార్‌పై మరోసారి మండిపడ్డ హైకోర్టు

Tuesday, November 3rd, 2020, 03:11:05 PM IST

ఏపీ సర్కార్‌పై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, నిమ్మగడ్డ తరఫు వాదనలను విన్న న్యాయస్థాయం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్నికల కమీషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి కానీ రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయని కోర్టు స్టేట్‌మెంట్ ఇచ్చింది. అసలు స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం సహాయమందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే దీనిపై మూడు రోజుల్లో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.