తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ..!

Wednesday, January 20th, 2021, 05:32:35 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై నేడు మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబందించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు.

అయితే దీనిపై ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు వివరించారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే ధర్మాసనం ఏజీని ఆదేశించింది. అంతేకాదు సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత దీనిపై తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.