బిగ్ న్యూస్: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు..!

Tuesday, December 15th, 2020, 12:00:51 AM IST

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. హెబియస్ కార్పస్ పిటిషన్, ఏపీలో జరుగుతున్న ఉద్యమాలపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై మండిపడింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విచారణను పునర్‌ పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

అయితే ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలకు అనుమతులు, పోలీసుల తీరుపై న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. ఏడాదిగా జరుగుతున్న అమరావతి ఉద్యమానికి అనుమతివ్వడం లేదని, మూడు రాజధానుల కోసం ఆందోళన చేసేవారికి మాత్రం అనుమతులిచ్చారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే మూడు రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. తాము వస్తుంటే శిబిరంలో వాళ్లు నల్లబ్యాడ్జీలు చూపిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్, పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా సంయమనంతో వ్యవహరిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.