ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్ట్ షాక్.. ఈ-వాచ్ యాప్‌పై స్టే పొడిగింపు..!

Tuesday, February 9th, 2021, 11:50:29 PM IST

ఏపీలో నేడు తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎమ్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులనైనా ఎస్ఈసీ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుండేలా ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్‌పై పలు అనుమానాలున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా గత వారం దీనిపై హైకోర్ట్ స్టే ఇచ్చింది.

అయితే దీనిపై మరోసారి నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్ యాప్ పై స్టేను మరో వారం రోజుల పాటు పొడిగించింది. యాప్‌ను పరిశీలించిన ఏపీ టీఎస్ నిపుణులు యాప్ అందులోని లోపాలు మరియు భద్రతపై ఎస్ఈసీకి నివేదిక సమర్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే యాప్‌ను రూపొందించడానికి సాంఘిక శాఖకు చెందిన సోర్స్ కోడ్ వినియోగించారని, కానీ సోర్స్ కోడ్ ను వినియోగించడానికి సాంఘిక సంక్షేమ శాఖ అనుమతులిచ్చిందా లేదా అన్నదానిపై ఎస్ఈసీ ఎలాంటి పత్రాలు సమర్పించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.