తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు..!

Wednesday, January 6th, 2021, 12:08:13 AM IST

Telangana_highcourt
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో వరద సాయం కింద పదివేల రూపాయల సాయాన్ని ప్రభుత్వం నగరవాసులకు అందించింది. అయితే ప్రభుత్వం అందించిన వరద సాయం అందరికి అందలేదని, అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టుకు లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే టీఆర్‌ఎస్‌ నేతలు పది వేలు పంచారని ఆరోపించారు. అయితే దాసోజు శ్రవణ్ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు సూచించింది.