ఏపీ సర్కార్‌కు హైకోర్టు సూటి ప్రశ్న.. నోటీసులు జారీ..!

Friday, November 27th, 2020, 05:11:28 PM IST

విశాఖలోని కాపులుప్పాడలో ప్రభుత్వం చేపడుతున్న గెస్ట్‌ హౌస్‌ నిర్మాణాన్ని ఆపాలంటూ అమరావతి జేఏసీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గ్రే హాండ్స్‌కి ఇచ్చిన స్థలంలో అతిథి గృహం నిర్మిస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్ వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రే హాండ్స్‌కి ఇచ్చిన స్థలంలో అతిథి గృహాన్ని ఎలా నిర్మిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా పార్టీ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా గెస్ట్‌ హౌస్‌ కొరకు కేటాయించిన 30 ఎకరాలలో చెట్లు కూడా నరకవద్దని కోర్టు ఆదేశించింది.