వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట..!

Friday, February 12th, 2021, 07:02:59 PM IST

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో స్వల్ఫ ఊరట లభించింది. పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని, వార్డు మెంబర్‌గా పోటీ చేసినా ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే జోగి రమేశ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎస్ఈసీ ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.

అయితే ఎస్ఈసీ ఆదేశాలపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియను కించపర్చేలా మాట్లాడవద్దని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ పథకాల గురించి మాత్రం మీడియాతో మాట్లాడవచ్చని కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మాత్రం మాట్లాడవద్దని ఎమ్మెల్యే జోగి రమేష్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఎస్‌ఈసీకి న్యాయస్థానం స్పష్టం చేసింది.