గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాతే వరద సాయం.. తేల్చి చెప్పిన హైకోర్టు..!

Wednesday, November 25th, 2020, 12:24:04 AM IST


హైదరాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం గ్రేటర్ ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. అయితే వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలని, వరస సాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ శరత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే వరద బాధితుల కోసం ఇస్తున్న సాయాన్ని కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారన్న ఫిర్యాదులు అందాయని అందుకే ఆ పథకాన్ని ఎన్నికలు జరిగేంత వరకు ఆపామని, తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎలక్షన్ కమీషన్‌‌ కోర్టుకు వివరించింది.

అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ కన్నా ముందే వరద బాధితుల సహాయం పథకం అమలులోకి వచ్చిందని పీటీషనర్ కోర్టుకు తెలపగా, ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్‌లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల నియమావళి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం కొనసాగించాలని స్పష్టం చేసింది.