ఏపీ సర్కార్‌కు హైకోర్ట్‌లో మరోసారి చుక్కెదురు..!

Wednesday, September 16th, 2020, 02:40:17 PM IST

Jagan

ఏపీ సర్కార్‌కు హైకోర్ట్‌లో మరోసారి చుక్కెదురు అయ్యింది. రాజధాని భూముల అవకతవకలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలో దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం తాజాగా సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని మద్యంతర ఉత్తర్వులలో పేర్కొంది. ఇదిలా ఉంటే రాజ్ధాని భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కూడా కేసులు నమోదు చేసింది. అయితే అమరావతి రాజధాని నిర్ణయం తీసుకోవడానికి ముందే అక్కడ టీడీపీ నేతలతో భూముల కొనుగోలు చేసి అవకతవకలకు పాల్పడ్డారని దీనిపై సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది.