బిగ్ న్యూస్: జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు..!

Monday, September 7th, 2020, 06:00:15 PM IST

YSJagan_highcourt

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘం విధులలో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టిపారేయాలంటూ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ఉద్యోగులను వేధించడానికే కేసు నమోదు చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు ఎన్నికల కమీషన్ నుంచి సీఐడీ తీసుకువెళ్లిన వస్తువులను ప్రభుత్వం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టును కోరారు. అయితే నేడు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారన్న దానిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.