కరోనా కేసుల విషయంలో తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్..!

Friday, September 4th, 2020, 07:47:38 PM IST

కరోనా కేసుల విషయంలో తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తుందని అభిప్రాయపడింది. కరోనా మరణాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో రిపోర్ట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు రోజుకు కేవలం 8,9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇస్తూ వస్తుందని చెప్పుకొచ్చింది.

అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజారోగ్యంకై ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని పిటీషనర్ కోరగా దీనిపై కూడా నివేదిక సమర్పించాలని కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని క్లుప్తంగా తెలపాలని కోరింది. అయితే 22వ తేదిలోపు ఈ నివేదికలను సమర్పించాలని, ఒకవేళ తప్పుడు నివేదికలు సమర్పిస్తే కనుక చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.