టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట.. సీఐడీ విచారణపై హైకోర్టు స్టే..!

Friday, March 19th, 2021, 07:30:02 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ కోర్టుకు తెలిపింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, మాజీ మంత్రి నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో స్టే విధించింది.