ఆర్జీవీ మర్డర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ..!

Friday, November 6th, 2020, 07:28:48 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా తెలంగాణ హైకోర్టు గుడ్‌న్యూస్ అందించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రణయ్ హత్యకేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రణయ్ తల్లుదండ్రులు నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించగా సినిమాపై స్టే విధించింది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూవీ రిలీజ్‌పై నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను ధర్మాసనం కొట్టిపారేసింది. కానీ మర్డర్ సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇచ్చింది. అయితే తాను సినిమా తీస్తున్న తీరును కోర్టు అర్ధం చేసుకుందని ఆర్జీవీ సంతోషం వ్యక్తం చేశాడు.