జగన్ సర్కార్‌కు షాక్.. స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Wednesday, December 23rd, 2020, 04:18:34 PM IST


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండగా, కరోనా కారణంగా ఇప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం మొండిపట్టుతో కూర్చుంది.

అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం వెళ్ళి కలవాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను కోర్టుకు తెలపాలని, దీనిపై తుది నిర్ణయం ఈ నెల 29న తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.