ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌కు మాస్క్..!

Wednesday, September 23rd, 2020, 05:37:42 PM IST

ట్రాఫిక్ నియమాలు పాటించండి ప్రమాదాల బారిన పడకండి అని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్‌గా వెళుతూ తమ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ట్రాఫిక్ పోలీసుల కెమెరా కంట పడకుండా నంబర్ ప్లేట్‌కు ఏదో ఒకటి అడ్డుపెట్టడం, నంబర్ ప్లేట్లను సగం వరకు మడచడం, లేదా ఒకటి రెండు నంబర్లను తొలగించడం చేసేవారు.

అయితే తాజాగా ఓ వాహనదారుడు తన బైక్ నెంబర్ ప్లేట్ కనిపించడకుండా మాస్క్ అడ్డుగా పెట్టాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిని రీ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీస్ శాఖ మాస్క్ ముఖానికి, బండికి కాదు అని, చలానా తప్పించుకోవడానికి మరో మార్గం కూడా ఉన్నది అదే ట్రాఫిక్ రూల్స్ పాటించడం అని పేర్కొంది. అంతేకాదు ట్రాఫిక్ రూల్స్ అనేవి మీకు మరియు మీ తోటి వాహనదారుల సౌకర్యార్థం, క్షేమం కోసమే అని గుర్తించండని చెప్పింది.