సినీ ప్రముఖులు అందుకే ముందుకు రావడం లేదు.. విశాఖ ఉక్కుపై మంచు విష్ణు క్లారిటీ..!

Friday, March 12th, 2021, 08:38:25 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకు ఉదృతమవుతుంది. తాజాగా హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్‌ కోసం విశాఖ వెళ్లిన మంచు విష్ణును నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. అంతేకాదు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి టాలీవుడ్‌ మద్దతు ఇవ్వాలని, లేదంటే సినీ ప్రముఖులు ఎవరు విశాఖకు వచ్చినా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

అయితే దీనిపై స్పందించిన మంచు విష్ణు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వందశాతం తప్పుడు నిర్ణయమని అన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తామని ముందుకొస్తున్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు ఇవ్వాలని సినీ ప్రముఖులకు ఉందని కానీ కొన్ని రాజకీయ కారణాల వలన ముందుకు రాలేకపోతున్నారని విష్ణు చెప్పుకొచ్చారు. అంతేకాదు దీనిపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని అన్నారు.