రికార్డ్: తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు..!

Tuesday, February 2nd, 2021, 05:02:28 PM IST

హైదరాబాద్‌ మెట్రోలో తొలిసారిగా గుండెను తరలించారు. అపోలో హాస్పిటల్‌ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను మెట్రో రైలులో తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 సంవత్సరాలు కలిగిన రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు వారి కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు.

ఈ నేపధ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శస్త్ర ‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను తరలించనున్నారు. నాగోలు మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలు నాన్‌స్టాప్‌గా వెళ్ళనుంది. రోడ్డు మార్గంలో వెళ్ళే అంబులెన్స్‌లో కంటే వేగంగానే మెట్రో రైలులో గుండె ఆసుపత్రికి చేరుకోవడంతో ఇది రికార్డుగా నిలిచింది.