బిగ్ షాకింగ్.. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..!

Wednesday, January 20th, 2021, 04:53:00 PM IST

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కుంటాల పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌లో 108 ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 42 సంవత్సరాల విఠల్ రావు అనే వ్యక్తి నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో కుంటాల పీహెచ్‌సీలో కరోనా టీకా తీసుకున్నాడు. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయి తిరిగి కోలుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన విఠల్ రావుకు రాత్రి 2.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి మొదలయ్యింది.

అయితే తెల్లవారుజామున 5 గంటలకు కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలపడంతో కరోనా టీకా వల్లే విఠల్ రావు చనిపోయాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే కరోనా టీకా వల్లే విఠల్ రావు చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని ప్రాధమిక విచారణలో తేలినట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే జనవరి 16 నుంచి ఇప్పటి వరకు 69,625 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కొందరికి చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి తప్పా ఎవరూ చనిపోలేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు.