గ్రేటర్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ ప్రకటిస్తే, ఎంఐఎం పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలంటూ డిమాండ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా భారతీనగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి హారీశ్‌రావు బీజేపీ, ఎంఐఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపార్టీలు ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు.
ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాల్చుడు, కూల్చుడు అని మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ త్రాగునీరు అందించామని, ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నామని అన్నారు. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని కరోనా కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యిందని అన్నారు. వరద సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, ఎన్నికల తర్వాత బాధితులందరికీ రూ.10 వేలు ఇస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అయితే ప్రశాంత హైదరాబాద్ కావాలా? లేక విధ్వంస హైదరాబాద్ కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.