బండి సంజయ్‌కి మంత్రి హరీశ్ సవాల్.. ముక్కు నేలకు రాస్తావా?

Monday, October 19th, 2020, 05:12:29 PM IST

ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక హాట్‌టాఫిక్‌గా మారింది. ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని అన్నారు.

గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్టు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసామని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారని అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే 2000 పెన్షన్ లో 1600 బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని చెబుతూ బండి సంజయ్ మోసగిస్తున్నారని, మోదీ 1600 ఇస్తున్నారని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అలా రుజువు చేయలేకపోతే ముక్కు నేలకు రాసి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.