బిగ్ న్యూస్: 18 ప్రశ్నలతో బండి సంజయ్ కి మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ!

Sunday, November 1st, 2020, 02:02:31 PM IST

బీజేపీ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. ఆరేళ్లుగా కేంద్ర బీజేపీ తెలంగాణ రాష్ట్రం కి అన్యాయం చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తను వేసే 18 ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పి తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.

బీజేపీ నాయకులకు నైతిక విలువలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంజూరు అయిన పలు ప్రాజెక్ట్ లను రద్దు చేసి తీరని అన్యాయం చేసింది అని తెలిపారు. అయితే మేం తెలంగాణ కి అన్యాయం చేశాం, మీరు మా పల్లకి మోయాలి అన్నట్లు బీజేపీ ధోరణి ఉంది అని విమర్శించారు. బీజేపీ నేతలు వ్యక్తిగత ఘర్షణలు, దూషణలకు పాల్పడుతున్నారు అంటూ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడగానే 7 మండలాలను ఆంధ్ర లో కలిపింది అన్యాయం కాదా?, సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్ర లో కలపడం ద్వారా 500 కోట్ల రూపాయల నష్టం మీ వల్ల కాదా అని ప్రశ్నించారు.

బయ్యారం, ఐటీ ఓ ఆర్ రద్దు, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రద్దు మీ పాపం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటయింపుల్లో అన్యాయం, తెలంగాణాకి జాతీయ ప్రాజెక్టు ఇవ్వకపోవడం, పోలవరానికి ఇచ్చి కాళేశ్వరం కి ఇవ్వకపోవడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లకు 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీటి అయోగ్ సూచించిన ఇవ్వక పోవడం, తెలంగాణ కి 3,155 కిలో మీటర్లు మంజూరు చేసి, 1,300 కే పరిమితం చేయలేదా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. వరంగల్ లో విమానాశ్రయం పునరుద్ధరించక పోవడం, వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్ కి సహాయం చేయక పోవడం, ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్ల లో అన్యాయం, జిల్లాలో నవోదయ పాటశాలలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. అయితే తెలంగాణ రాష్ట్రం పై, ప్రజల పై ప్రేమ ఉంటే బండి సంజయ్ తన చిత్త శుద్ది నిరూపించుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.