ఏపీ సీఎం జగన్‌కు గవర్నర్ ఫోన్.. ఏలూరు పరిస్థితిపై ఆరా..!

Wednesday, December 9th, 2020, 01:30:50 AM IST

ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్ చేశారు. ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితిని గురుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సీఎం జగన్‌కు గవర్నర్ ఆదేశించారు. వింత వ్యాధి బారినపడిన వారికి వైద్య సాయంతో పూర్తి సహాయసహకారాలు అందించాలని, స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఎక్స్ పర్ట్ ప్రొఫిషనల్స్ సాయం తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని సీఎంకు గవర్నర్ సూచించారు.

అయితే ఏలూరులో 500మందికి పైగా ఈ వింతవ్యాధి బారిన పడ్డారని, ఇప్పటి వరకు 250కి పైగా పేషంట్లు ఈ వ్యాధి బారి నుంచి కోలుకున్నారని సీఎం జగన్ గవర్నర్‌కు తెలిపారు. బాధితులకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య సాయం అందించిందని, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే జాతీయస్థాయి సంస్థలైన జాతీయ పోషకాహార సంస్థ, ఎయిమ్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యూలార్, మాలిక్యులర్ బయాలజీ సంస్థలు ఇప్పటికే ఈ వింత వ్యాధిపై అధ్యయనం చేస్తున్నాయని, బాధితుల నుంచి బ్లడ్ శాంపిల్స్‌తో పాటు ఇతర శాంపిల్స్‌ను కలెక్ట్ చేసి పరీక్షలు చేస్తున్నాయని గవర్నర్‌కు సీఎం జగన్ తెలిపారు.