గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పరిశీలనలోకి గోరటి వెంకన్న పేరు?

Wednesday, September 16th, 2020, 07:32:45 AM IST

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ రేసులో ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాని కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తన మాటలు, పాటలతో తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి గోరటి వెన్నుదన్నుగా నిలిచారని ఈ కారణంగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి ఇది వరకే ఎమ్మెల్సీగా ఉన్న కర్నె ప్రభాకర్‌కు మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండగా, మరొక స్థానం కూడా తిరిగి సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికే అప్పగిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక మూడో స్థానం కోసం మొదటి నుంచి మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మూడింటిలో ఒక స్థానం ఎస్సీ, ఎస్టీలకు దక్కవచ్చని అందుకే గోరటి వెంకన్న పేరు సీఎం పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తుంది.