ఇకపై అలాంటి పాటలు రాయను.. గోరేటి వెంకన్న కీలక వ్యాఖ్యలు..!

Monday, November 16th, 2020, 05:43:35 PM IST

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్‌కు కవులన్నా, కళాకారులన్నా చాలా గౌరవమని అన్నారు. పల్లె వెతలపై పాటలు కట్టి పాడిన తనకు వారి సమస్యలను పరిష్కరించడానికి లభించిన చక్కని అవకాశమని అన్నారు.

అయితే ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. తెలంగాణ ఈ ఆరేళ్లలో చాలా అభివృద్ధి చెందిందని, కొత్తగా ఏర్పడ్డ ఏడు రాష్ట్రాలకంటే మన తెలంగాణ చాలా ముందుందని అన్నారు. ఇకపై తాను కన్నీటీ పాటలు రాయనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కొందరు నేతలు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అది మంచిది కాదని అన్నారు.