వారికి సీఎం గ్లామర్ పాఠాలు!

Wednesday, April 1st, 2015, 12:43:45 PM IST


వైద్య శాఖలో జరుగుతున్న అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఆందోళన బాట పట్టిన నర్సులను ఉద్దేశించి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో 108 సేవల నిర్వహణ కాంట్రాక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ గోవాలో కొంతకాలంగా నర్సులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంగా 33 అంబులెన్స్ లను నడపాల్సిన చోట 13 వాహనాలనే తిప్పుతూ సదరు ప్రైవేటు సంస్థ సర్కారు సొమ్మును దోచుకుంటోందని ముఖ్యమంత్రికి పిర్యాదు చేసేందుకు నర్సులు సచివాలయానికి వెళ్లారు.

కాగా పిర్యాదు స్వీకరించాల్సిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ ‘ఎండలో సమ్మె చేస్తే గ్లామర్ పోతుంది… నల్లగా అయిపోతారు.. తర్వాత పెళ్ళికొడుకు దొరకడం కష్టం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇక ఈ వ్యాఖ్యలతో ఇటు నర్సులతో పాటు అటు కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సీఎం అలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయ సభ్యులు వీటిని కొట్టిపారేయడం కొసమెరుపు.