కరువు కారణంగా పెళ్లికి ‘నో’ చెప్పిన యువతులు..!

Monday, February 29th, 2016, 05:05:00 PM IST


మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతానికి చెందిన యువతులు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో ప్రధానంగా నిలిచారు. ఆ వివరాలలోకి వెళితే, బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ ప్రాంతానికి చెందిన 25 మంది యువతులు ఈ ఏడాది పెళ్ళిళ్ళు చేసుకోరాదని తాజాగా నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా సదరు యువతులు.. కరువుతో తమ కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు దిగజారడంతో, తమకు పెళ్ళిళ్ళు చేయలేక తమ తల్లిదండ్రులు విపరీత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ విషయంపై తాజాగా సరిత అనే యువతి మాట్లాడుతూ.. తమ గ్రామంలో 20 నుంచి 25 మంది అమ్మాయిలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, తామంతా ప్రభుత్వ సాయం కోరుతున్నామని తెలిపింది. అదే విధంగా మరో యువతి కూడా మాట్లాడుతూ.. రెండు మూడేళ్ళ నుంచి కరువు తీవ్రంగా ఉందని, తమ తల్లిదండ్రులు ఏడాదంతా కష్టపడితే 30 వేల రూపాయలు వస్తాయని, ఆ డబ్బు తమ అవసరాలకే సరిపోవడం లేదని, ఇక పెళ్ళిళ్ళు ఎలా చేస్తారని వారి కష్టాలను చెప్పుకొచ్చింది. కాగా, మరాఠ్వాడ ప్రాంతంలోని లాటూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాలలో కరువు పరిస్థితులు దారుణంగా మారడంతో రైతులు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్ళిపోవడమే కాకుండా, ఈ ఏడాది ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని మొత్తం 124 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందిస్తాయో లేదో చూడాలి.