గ్రేటర్‌లో మళ్ళీ ప్రారంభమైన వరద సాయం పంపిణీ..!

Wednesday, December 9th, 2020, 08:00:39 PM IST

గ్రేటర్ హైదరబాద్‌లో వరద బాధితులకు ఇస్తున్న పది వేల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరద బాధితులకు అందించే ఆర్థిక సాయం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి మళ్లీ వరద బాధితులకు నగదు సాయం అందిస్తామని తెలిపారు.

దీంతో ఈ నెల 7న ఉదయం నుంచే పలువురు బాధితులు మీ సేవ సెంటర్ల ముందు క్యూ కట్టారు. గతంలో మాదిరిగా వరదసాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమీషనర్ తెలిపారు. వరదసాయం అందని వారి వివరాలను జీహెచ్ఎంసీ బృందాలు సేకరిస్తున్నాయని ప్రకటించారు. ఈ నేపధ్యంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమైనదని, ఒక్క మంగళవారం నాడే 7939 మంది బాధితులకు 7.949 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు.