వరద బాధితులు ఎవరూ మీ సేవా కేంద్రాలకి వెళ్లాల్సిన అవసరం లేదు

Monday, December 7th, 2020, 12:11:24 PM IST

ఇటీవల భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్దికంగా చాలా నష్టపోయారు. అయితే వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వరద సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వరద సహాయం కోసం హైదరాబాద్ వాసులు మీ సేవా కేంద్రాలకి రావాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ అవుతుంది అని జీ హెచ్ ఎం సి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. బాధితుల ధృవీకరణ పూర్తి అయ్యాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే వరద సహాయం కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగవద్దు అని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ ధృవీకరణ జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతం బాధితులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం మీ సేవా కేంద్రాల చుట్టూ బాధితులు వస్తుండటం తో అధికారులు ఈ మేరకు సూచనలు చేశారు.