తిరుమల ప్రధానార్చకుని మంగళ హారతితో పురాణపండ శ్రీనివాస్

Saturday, December 26th, 2020, 03:20:20 PM IST

పురాణేతిహాస కావ్యాల్లోని భగవద్రూపాలను ఉపాసనాపరంగా , తత్వపరంగా , కథాపరంగా అద్భుతంగా వివరించడంలో అగ్రపీఠంలో ఆశీనులైన మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ ఒక మంగళకరమైన గ్రంధాన్ని ఆవిష్కరించి తెలుగు భక్తలోకాన్ని తన్మయింప చేశారు. తెలుగు రాష్ట్రాలలో తన అసాధారణ మేధా సంపత్తితో రచించి, సంకలనీకరించి, వ్యాఖ్యానించడంలో ఒక విలక్షణతను ప్రదర్శించే ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ఆధ్యాత్మిక ప్రార్ధనా గ్రంథమైన ‘ శ్రీమాలిక ‘ ఇప్పటికే వేలకొలది భక్త పాఠకుల్ని విశేషంగా ఆకర్షించి ఉర్రూతలూగిస్తోంది.

తెలంగాణా రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకురాలు, ముఖ్యమంత్రి కుమార్తె, ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత సమర్పణలో ఏడవ ప్రచురణగా రూపుదిద్దుకున్న పురాణపండ శ్రీనివాస్ ‘ శ్రీమాలిక ‘ గ్రంధాన్ని వైకుంఠ ఏకాదశి వేడుకలో మహా ప్రవచన కర్త గరికిపాటి నరసింహారావు ఆవిష్కరించి తొలిప్రతిని కల్వకుంట్ల కవితకు అందజేశారు.

ఈ సందర్భంగా గరికిపాటి మాట్లాడుతూ చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ కి భగవంతుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడని , ధార్మిక గ్రంధాలను తాదాత్మ్య స్థితిలో అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ కృషి అసాధారణ ఘట్టంగా పేర్కొనాల్సిందేనని చెప్పారు.

టి.ఆర్.ఎస్. నాయకురాలు కవిత మాట్లాడుతూ – సాహితీమిత్రులు పురాణపండ శ్రీనివాస్ ఏడేళ్లుగా తనకి పరిచయమని , ఎంతో సంస్కారంగా ఉపాసనాపరమైన శ్రీనివాస్ గారి ప్రవర్తన తనని ఆకట్టుకుందని , పురాణపండ శ్రీనివాస్ గారి బుక్స్ ఒక ప్రత్యేకతతో కూడి వుంటాయని ప్రశంసించారు. ఈ గ్రంధానికి తాను సమర్పకురాలిగా వ్యవహరించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంలో గరికిపాటి వారి ఛలోక్తులు, కధలు విశేషంగా సభికుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యాదాద్రి ప్రాజెక్ట్ డైరెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ. కిషన్ రావు, త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి , లయన్ విజయ కుమార్, తెలంగాణా శ్రేణులు తదితర ప్రముఖులతో ఆడిటోరియం క్రిక్కిరిసి పోయింది. వందలకొలది సభికులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యవేక్షణలో శ్రీమాలిక మహా గ్రందాన్ని ఉచితంగా అందించారు. ఆహ్వాన పత్రంలో గౌరవ అతిధిగా పేరున్నప్పటికీ పురాణపండ శ్రీనివాస్ ఈ సభకు కూడా ఎప్పటిలానే హాజరుకాకపోవడం గమనార్హం.

పురాణపండ శ్రీనివాస్ ఎక్కువగా సభలకు రావట్లేదని, ఆ సమయాన్ని కూడా ఆయన మహాగ్రంధ ప్రచురణ, ప్రచారోద్యమానికే కేటాయిస్తున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా నిర్వాహకులు సూటిగా చెప్పడం విశేషం. మరో విశేషమేంటంటే వైకుంఠ ఏకాదశి సాయంకాలవేళ తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వగృహానికి వెళ్లిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ …. వేణుగోపాల దీక్షితులు ఇంట జరుగుతున్న ఏకాదశి పూజ సందర్భంలో మంగళ దివ్య హారతిని ప్రధాన అర్చకుని నుండి స్వీకరిస్తున్న భక్తి రసభరిత దృశ్యాన్ని కూడా చిత్రంలో చూడవచ్చు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన పుణ్య వేడుకల్లో పాల్గొన్న భక్తులకు వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి , వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ పంచిన గోవిందుని మంత్ర గ్రంధాలు తెలుగు రాష్ట్రాలలో అనేక శ్రీవైష్ణవ ఆలయాల్లో దర్శనమివ్వడం ప్రత్యేకంగా చెప్పాల్సిందే.