విశాఖ ఉద్యమంలో పాల్గొంటా.. గంటాకు మంత్రి కేటీఆర్ హామీ..!

Saturday, March 20th, 2021, 09:29:28 PM IST

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో వీరు ఇద్దరు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపినందకు మంత్రి కేటీఆర్‌కు గంటా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలియజేయాలని కోరారు. గంటా విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్‌తో చర్చించి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు మరియు మంత్రులతో కలసి వచ్చి ఉద్యమంలో పాల్గొంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు గంటా చెప్పుకొచ్చారు.

ఇటీవల విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. మన పక్కనే ఉన్నవాళ్లకు కష్టం వచ్చినప్పుడు మన స్పందించకపోతే.. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ముందుకు వస్తారన్న కేటీఆర్ అన్నారు. అంతేకాదు ఈ విషయంలో అవసరం అయితే విశాఖకు వెళ్లి ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.