గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు ఇక శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతున్నాడా? రాజకీయాల పట్ల ఎమ్మెల్యే వంశీ వైరాగ్యం చెందారా అంటే అవునన్న సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీడీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన వల్లభనేని వంశీ 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కూడా గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఆయన అనంతరం వైసీపీకి మద్ధతు పలికారు.
అయితే టీడీపీనీ వీడాకా వైసీపీలో అధికారికంగా చేరకపోయినప్పటికి జగన్‌కు మద్దతిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వంశీ ఓ సారి ప్రకటించినప్పటికి అది జరగలేదు. అయితే తాజాగా నేడు ఆయన మాటలు చూస్తుంటే రాజకీయాల పట్ల వైరాగ్యం చెందినట్టు తెలుస్తుంది. వైసీపీలో తాను అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ కొందరు తనపై గొడవలు సృష్టించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై వైసీపీ అధిష్ఠానం కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. అయితే ఇదంతా చూస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వల్లభనేని ఉన్నట్లు సమాచారం.