టీడీపీకి మరో షాక్.. పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ కుమారి రాజీనామా..!

Thursday, October 1st, 2020, 05:40:50 PM IST

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. అయితే పార్టీ కమిటీలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునర్వ్యవస్థీకరణ చేస్తున్న తరుణంలో గల్లా అరుణ రాజీనామా చేయడం ఇప్పుడు టీడీపీలో చర్చానీయాంశంగా మారింది. అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989, 1999,2004 మధ్యకాలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా అరుణ కుమారి ఆరోగ్య శాఖకు మరియు భూగర్భ, గనుల శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు.

అయితే రాష్ట్ర విభజన అనంతరం అరుణ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిపోయారు. అంతేకాదు 2014 ఎన్నికలలో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు అయితే గల్లా అరుణ తనయుడు గల్లా జయదేవ్ మాత్రం 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు. అయితే వ్యక్తిగత కారణాల వలనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ రాజీనామా చేశారని ఓ వర్గం చెబుతున్నా, మరో వర్గం మాత్రం గల్లా ఫ్యామిలీ టీడీపీనీ వీడేందుకు రెడీ అయ్యిందని చెబుతున్నారు.