వైఎస్ షర్మిలతో కలిసి పనిచేస్తా.. మాజీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..!

Tuesday, April 6th, 2021, 07:30:23 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటుపై వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ సేన్ షర్మిలను లోటస్ పాండ్‌లో కలిశారు. వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.

అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ డీజీపీ స్వరణ్ జిత్ సేన్ వైఎస్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం అని అందుకే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశానని వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు అవసరం అయితే వైఎస్ షర్మిలతో కలిసి పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలోనే స్వరణ్ జిత్ సేన్ సతీమణి అనితా సేన్ వైఎస్ షర్మిలను కలిశారు. అయితే వీరి భేటీనీ బట్టి చూస్తుంటే వైఎస్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.