ప్రజా సంక్షేమం కోసమే భూసేకరణ చట్టం!

Monday, March 23rd, 2015, 03:53:11 PM IST

venkaya-naidu
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ చట్టం ప్రజా సంక్షేమం కోసమేనని సమర్ధించారు. అలాగే కొత్త భూసేకరణ చట్టం చెయ్యాలా, లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని వెంకయ్య స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్ ఏప్రిల్ 6 లోపు చట్టం కాకపోతే చెల్లుబడి కాదని, దాన్ని ఏ విధంగా చట్టం చెయ్యాలో కేంద్రం చూసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కావాలనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, అర్ధవంతమైన నిర్మాణాత్మక సలహాలు ఉంటే స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని, అంతేగాని కావాలని వ్యతిరేకిస్తే పట్టించుకోమని వెంకయ్య స్పష్టం చేశారు. ఇక మిషన్ కాకతీయ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన వెంకయ్య కొత్త భూసేకరణ చట్టం ద్వారా రైతులకు, వారి పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.