ఏపీ, తెలంగాణలో తొలి కరోనా టీకా తీసుకున్నది ఎవరంటే?

Saturday, January 16th, 2021, 04:12:57 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం చేసి, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేశారు. సొంత లాభం కొంత మానుకొని.. తోడివాడికి సాయపడవోయ్. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్ అంటూ ఈ కష్టకాలంలో మనం అందరం అందరికీ అండగా, తోడుగా నిలవాలని ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు.

అయితే దేశంలో ముందుగా మనీష్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికునికి టీకా వేశారు. అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కరోనా టీకా వేయించుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యింది. విజయవాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ ప్రారంభించారు. అయితే ఏపీలో తొలి టీకాను వైద్య ఆరోగ్యశాఖలో స్వీపర్‌గా పని చేస్తున్న పుష్పకుమారి తీసుకున్నారు.

ఇక తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్ కలిసి గాంధీ ఆసుపత్రిలో సంయుక్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే తెలంగాణలో తొలి టీకాను సఫాయి కార్మికురాలు ఎస్. కృష్ణమ్మ తీసుకున్నారు. టీకా తీసుకున్నాక ఆమెతో మంత్రి ఈటల సంభాషించారు.