విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం.. లాడిల్ తెగిపోవడంతోనే..!

Saturday, December 19th, 2020, 01:16:47 AM IST

విశాఖపట్నం గాజువాకలో ఉన్న స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎమ్ఎస్-2 లో లాడిల్ తెగిపోయి ఉక్కు ద్రావణం కింద పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి.

అయితే ఘటన స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ ఆస్పత్రి వైద్యులకు సూచించారు. కాగా ఇటీవల వరుసగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతా పరంగా మరికొన్ని పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రేడ్ యూనియన్లు అధికారులను డిమాండ్ చేస్తున్నాయి.