టీఎస్ జెన్‌కో విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..!

Friday, August 21st, 2020, 09:05:51 AM IST

శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మంటలు టన్నెళ్లకు వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలతో పేలుళ్లు సంభవించాయి. దీంతో రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు దట్టమైన పొగ కమ్ముకుపోయింది.

అయితే ప్రమాద సమయంలో విద్కుత్ కేంద్రంలో 17 మంది ఉన్నారని, 8 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడిన మరో తొమ్మిది మంది మాత్ర లోపలే ఉన్నట్టు సమాచారం. అయితే వీరిని కాపాడేందుకు ఆక్సిజన్ పెట్టుకుని రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నా దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి నుంచి సహాయక బృందాలను రప్పించి మిగతా వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎస్పీ, కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తుండగా కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ కూడా ఈ ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం.